సహజ ప్రసవానికి కొన్ని చిట్కాలు
ప్రసవ సమయంలో సొగసైన అనుభవానికి ఎంచుకోండి ఎన్నో అవసరమైన సూచనలు.

Image: Shutterstock
మీకు తెలుసా, 85% స్త్రీలకు ప్రసవం, అంటే డెలివరీ, సహజంగా జరిగే అవకాశం ఉంది. స్త్రీ శరీర నిర్మాణం దానికి అనువుగానే ఉంటుంది. కేవలం 15 % వారికి వారి ఆరోగ్య రీత్యా, ఇతర కారణాల వలన ఆపరేషన్ చేసి బిడ్డను తియ్యాల్సివస్తుంది.
నేటితరంలో కొందరు “ఆ! ఆ నొప్పులు, ఆందోళన ఎవరు పడతారు?” అని ఆపరేషన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ సహజంగా జరిగే డెలివరీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ప్రసవ వేదన ఎక్కువ లేకుండా, సునాయాసంగా కనవచ్చని మన పూర్వికులు రుజువు చేశారు.
సహజమైన డెలివరీ వల్ల పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ (immunity system) బాగా ఉంటుంది. ప్రసవం తరువాత కోలుకోవటం సులభం. శరీరంలో సహజంగా నొప్పిని తగ్గించే హార్మోన్లు విడుదలవుతాయి. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండేపని లేదు. మరి ఇన్ని లాభాలున్నప్పుడు సహజమైన డెలివరీ ఎవరు ఒద్దనుకుంటారు?
సహజమైన డెలివరీ కావాలంటే, కొన్ని చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు, వ్యాయామాలు పాటించాలి. అవి ఏమిటో మోంజుంక్షన్ మీకు ఇక్కడ తెలుపుతుంది
సహజ ప్రసవం కోసం పాటించాల్సిన నియమాలు
1 . ఒత్తిడి ని దూరంగా పెట్టండి:
అనవసరమైన ఒత్తిడి, నెగెటివ్ గా ఆలోచించటం, ఆందోళన పడటం అస్సలు పనికిరాదు. మనసు నిర్మలంగా, హాయిగా ఉంచుకోండి. దానికి ధ్యానం చెయ్యడం, మీకిష్టమైన సంగీతం, పాటలు వినడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి దృశ్యాల్ని ఊహించుకోవడం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునే స్నేహితుల, సన్నిహితుల సాంగత్యంలో గడపండి.
మీకు ఎప్పుడన్నా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంటే, టబ్ లో నీళ్లు నింపుకుని జాగ్రత్తగా పడుకోండి, శరీరానికి హాయిగా ఉండి, ఒత్తిడి తగ్గుతుంది. షవర్ కూడా బాగా ఉపకరిస్తుంది.
ఒక చిన్న ఆట : భర్త తో కూడా ఇది ఆడచ్చు. ఒక మంచు ముక్క ని చేతిలో పట్టుకుని ఎంతవరకు భరించగలరు? నడుస్తూ, నిశ్శబ్దంగా కొంచం సేపు పట్టుకుని చూడాలి. దానిని బట్టి పురిటి నొప్పులు ఎంత తేలికగా భరించ గలరో అంచనా వేసుకోవచ్చు.
2. నిరుత్సాహ పరిచే మాటలు వినకండి:
వాళ్ళు, వీళ్ళు ఒక్కోసారి తెలిసో, తెలీకో కొన్ని కష్టతరమైన ప్రసవాలని గురించి చెప్తూ ఉంటారు. విషాదకరమైన విషయాలు వినకండి. ఎక్కడో నూటికో, కోటికో ఒక్క డెలివరీ కొన్ని అనివార్య కారణాలవల్ల విషాదం సంభవించవచ్చు. కానీ మనకి ఏమీ కాదు, అని గట్టిగా మనసులో అనుకోవాలి.
౩. జ్ఞానం సంపాదించండి:
భయాన్ని, బెరుకుని పోగొట్టేది జ్ఞానం. అందుకే అసలు డెలివరీ ఎలా జరుగుతుంది అని, సైన్టిఫీగ్గా (వైజ్ఞానికంగా) తెలుసుకోండి. ఇన్ని లక్షలమంది ఈ భూమి మీద పుట్టారంటే, అది భయంకరమైనది కాదు. భయం అనవసరం. ఇంట్లో ఉన్న పెద్దలతోనో, అమ్మతోనో చర్చించండి. వారికంటే మనకి శ్రేయోభిలాషులు ఎవరు?
4. మంచి డాక్టర్ ని ఎన్నుకోండి:
తెలివిగా ముందుగానే కాస్త వాకబు చేసుకుని, తగిన డాక్టర్ని ఎన్నుకుని, ముందు నించే పరీక్షలు చేయించుకుని, రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ అత్యవసరమైతే తప్ప ఆపరేషన్ చెయ్యరు అన్న గురి ఉన్నవాళ్లయితే మంచిది.
అనుభవమున్న మంచి నర్సు ని మనవద్ద నియమించుకోగలిగితే, నిత్యం కాళ్ళు, నడుము, వీపు నెమ్మదిగా, మృదువుగా మసాజ్ (మర్దన ) చేయించుకుంటే బాగుంటుంది.
5. బాగా నీళ్లు తాగండి:
గర్భిణీలు ఎక్కువ నీళ్లు తాగితే, సహజమైన డెలివరీ సాధ్యం. శరీరానికి, నరాలకు సత్తువనిచ్చేది నీళ్ళే. సమస్య లేకుండా సహజమైన ప్రసవం జరగాలంటే, ప్రతి రోజు పళ్ళ రసాలు, మంచి నీళ్లు సంవృద్ధిగా తాగాలి.
6. కొన్ని కూడనివి:
తప్పుడు భంగిమలలో కూర్చోవటం (మరకాలు వేసుకుని) మంచిది కాదు. నడుంకి ఏదో ఒక దన్ను ఉండేలా చూసుకోవాలి. బిగువైన బట్టలు వేసుకోవడం, బిగించి బెల్టులు పెట్టుకోకూడదు, బరువులు మొయ్యడం తగ్గించుకోండి. శరీరం బరువు పెరుగుతుంది, కానీ అతిగా పెరగకుండా చూసుకోవాలి.
ఈ నియమాలతో పాటు, మీరు తీసుకునే ఆహారం కూడా సులభ ప్రసవం జరిగేందుకు తోడ్పడుతుంది.
సుఖ ప్రసవానికి సహకరించే ఆహారం
ఆరోగ్యకరమైన తల్లి ఆరోగ్యకరమైన బిడ్దనివ్వగలదు. మరి ఆమె తినే ఆహారం మీదే ఆమె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కదా?
- కూరలు, పళ్ళు: తాజా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి.
- ఐరన్ ఉన్న ఆహారం: గర్భిణులకు ఎక్కువ ఐరన్ అవసరము. సంవృద్ధిగా ఐరన్ ఉండే ఆహారం తినాలి. సులభంగా జీర్ణమయ్యే మాంసం, ఆకుకూరలు తినవచ్చు. చేపలవంటి జలచరాలు తింటే మంచిదే.
- కొన్ని రకమైన పళ్ళు: పళ్ళల్లో కొన్ని యోని భాగాన్ని సాగడానికి సహకరిస్తాయి. బ్రోమిలియాన్ బాగా ఉండే పదార్ధాలు తినాలి. ఉదాహరణకి మామిడి పండు,అనాస అంటే పైనాపిల్ పండు వంటివి. ఇవి మరీ మోతాదు మించి అతిగా మాత్రం తినకూడదు.
- మరి కారం తినవచ్చా: శరీరం లో వేడినిచ్చేది కారం, ఒక రకంగా మంచిదే. కానీ ఏదైనా ఎక్కువ తింటే, అసిడిటీ, అజీర్ణం, విరోచనాలు కలిగే ప్రమాదం ఉంది.
- మరికొన్ని ఆహార నియమాలు: చెక్కెర తగ్గిస్తే మంచిది, రెటీనోల్ ఉన్నఆహారం పనికి రాదు. అలాగే, వీధుల్లో బండి మీద అమ్మే తినుబండారాలు అస్సలు తినకండి. రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
గర్భవతిగా ఉన్నప్పుడు కదలకుండా కూర్చోవాల్సిన అవసరం లేదు. మీ పనులు చేసుకుంటూ, స్వల్ప వ్యాయామం చేస్తే మీ ప్రసవం సులభమవుతుంది.
సుఖ ప్రసవానికి ఉపకరించే వ్యాయామాలు
గర్భ ధారణ జరిగాక, డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి వ్యాయామమూ చెయ్యకూడదు. డాక్టర్ సలహా మేరకు మామూలు వ్యాయామాలు కొన్ని చేయటము వల్ల బిడ్డ పుట్టడానికి ఉపయోగపడే కండరాలు, యోని కండరాలు బలంగా, ప్రసవానికి అనువుగా తయారవుతాయి.
12. శ్వాసతో వ్యాయామం:
శ్వాస అన్నది మనకి తెలియకుండానే జరిగేది. అన్ని అవయవాలకు ప్రాణవాయువుని చక్కగా అందించి, రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. ఛాతి నించి శ్వాస తీసుకోవటం, కడుపు భాగం నించి శ్వాస తీసుకోవటం, దీర్ఘంగా శ్వాస తీయటం, ఒకసారి చిన్న శ్వాస, మరొకసారి దీర్ఘశ్వాస తీసుకోవటం ద్వారా శరీరానికి సత్తువ చేకూరుతుంది.
13. నడక, ఈత:
నడక, ఈతకొట్టడం రెండూ మంచి వ్యాయామాలు. నడక కోసం అనువైన, మంచి షూ వేసుకోవాలి. ఎగుడు, దిగుడు లేని మంచి బాట, అదికూడా పచ్చని తోటలో అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రోజు కనీసం ౩౦ నిమిషాలు నిదానంగా నడిస్తే, బీపీ సమస్య, అజీర్తి సమస్యలకి కూడా దూరంగా ఉండవచ్చు.
ఈత కొట్టడం వల్ల గుండె, కండరాలు బలంగా ఉంటాయి. ఈ కసరత్తులు శరీరాన్ని సుఖ ప్రసవానికి బాగా తయారుచేస్తాయి. ప్రతి రోజు సరైన వ్యాయామం చెయ్యటం వల్ల తొడ కండరాలు బలంగా అయ్యి, ప్రసవ ఒత్తిడిని తట్టుకుంటాయి. నడుము, యోని కండరాలు సంసిద్ధమవుతాయి. సీతాకోకచిలుక భంగిమ, వివిధ భంగిమలు ప్రసవాన్ని సులభం చేస్తాయి.
14. ప్రసవానికి ముందు యోగా:
యోగా ఆరోగ్యానికి మూలం. యోగా ద్వారా సరిగ్గా ఊపిరి తియ్యటం అలవడుతుంది. అదే ప్రసవాన్ని సులభం చేస్తుంది. యోగా, శ్వాసప్రక్రియ ద్వారా చాతి, భుజాలు, పిరుదులు, అన్నీ వదులుగా అయ్యి, కండరాల బిగుతు తగ్గిస్తుంది. శిక్షణ పొందిన మంచి యోగా టీచర్ సలహాపైనే యోగా చెయ్యాలి. సొంతంగా చెయ్యరాదు.
గర్భవతిగా ఉన్నప్పుడు మీకు విశ్రాంతి అవసరమే కానీ రోజువారీ పనులు చురుకుగా చక్కగా చేసుకోవాలి. అతిగా అలిసిపోకుండా, తిరుగుతూ పనులు చేసుకుని, పౌష్ఠిక ఆహారాన్ని సేవిస్తూ ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా ఉంటే, ప్రసవం సులువుగా, సహజంగా జరిగి, ఆరోగ్యమైనా బిడ్డని ఎత్తుకుంటారు.











